gunturu

గుంటూరు: వేలేళ్ల చరిత్ర – మట్టిమాటల మాధుర్యం

కారంపూడిలో కలియదిరిగిన పాతరాతి యుగపు మానవుడు… భట్టిప్రోలులో రాజ్య పతాకాన్ని ఎగరేసిన యశోధరుడు… చరిత్ర గుర్తులెన్నో!
పౌరుషానికి ప్రాణం పెట్టే పల్నాడు… కళల కాణాచి తెనాలి… విస్మరించలేని ఊళ్లెన్నో!
సిరుల వరాలనిచ్చే వరి… ఘాటెక్కించే మిరప… దుగ్గిరాల పసుపు… పలకరించే పైరులెన్నో!
మంగళగిరి పానకాల నరసింహుడు… కోటప్పకొండ కోటేశ్వరుడు… అభయమిచ్చే దేవరలెందరో!

అన్నింటికీ మించి అమరావతి! అందరినీ దాటి అక్కడి బుద్ధుడు; అమరలింగేశ్వరుడు.
వేల సంవత్సరాల తెలుగుజాతి ప్రస్థానానికి సజీవ సాక్ష్యం ఆ నేల. అదే గుంటూరు.
ఆ మట్టి గుండెల్లో ప్రతిధ్వనించే తెలుగు… తులసికోట ముందు ప్రమిద వెలుగు!


అకట! తెల్గునేల, అందున గుంటూరు

అకట! తెల్గునేల, అందున గుంటూరు
మండలమున బుట్టు మానవుండు
కొసరి కొసరి యింత గోంగూర దిననిచో
ఏమి బ్రతుకు వానిదేమి మెతుకు

అన్నారు తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి. ఆ గోంగూర రుచే గుంటూరు మాండలికంలోనూ చేరింది.


చరిత్ర: శాతవాహనుల నుంచి ఆధునిక జిల్లా వరకు

గుంటూరు మండల చరిత్ర శాతవాహనులతో మొదలవుతుంది. క్రీ.శ. రెండో శతాబ్దంలో ధాన్యకటకం (ధరణికోట) వాళ్ల రాజధాని.
ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, వెలనాటి చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు పాలించారు.
ఆ కాలంలో ఇది వెలనాడు, పాకనాడు పేర్లతో ప్రసిద్ధికెక్కింది.

తళ్లికోట యుద్ధానంతరం నవాబుల వశమైంది. తర్వాత ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది.
1904లో కృష్ణాజిల్లా నుంచి విడిపోయి గుంటూరు జిల్లా ఏర్పడింది. 1971లో కొంతభాగం ప్రకాశం జిల్లాలో కలిసింది.

ప్రస్తుతం ఉత్తరాన కృష్ణానది హద్దుగా గుంటూరు మండలం 12 వేల చ.కి.మీ. విస్తీర్ణంలో వంద కి.మీ. సముద్రతీరంతో అలరారుతోంది.
ఒక ప్రత్యేక భాషావ్యవస్థ కూడా ఇక్కడ రూపుదిద్దుకొంది.


మహనీయుల గడ్డ

తిక్కన, నారాయణ తీర్థులు, జాషువ, తుమ్మల, ఏటుకూరి, జంధ్యాల పాపయ్యశాస్త్రి, ఉన్నవ, స్థానం మొదలైన మహనీయులు పుట్టిన గడ్డ ఇది.


ప్రాంతాన్ని బట్టి మాటతీరు

గుంటూరు జిల్లాలో ప్రాంతాన్ని బట్టి తెలుగు మాటలో మార్పు కనిపిస్తుంది.

  • పల్నాడు : కరుకుదనం కొద్దిగా ఎక్కువ
  • గుంటూరు : కరుకుదనం కొద్దిగా తక్కువ
  • తెనాలి : మృదువుగా అనిపిస్తుంది

ఉదాహరణలు:

  • పల్నాడు: “ఆ ఏందంట ఏంది”
  • గుంటూరు: “ఏంటి చెప్పు నువ్వు చెప్పేదేదో”
  • తెనాలి: “ఎలా, ఏమిటి, ఎట్టా”

పదాలు (ఉదాహరణ):


ఆ ఎత్తిపొడుపు… ఆ పుల్లవిరుపు

ప్రజల వాడుకే రచనల్లో ప్రతిఫలించాలనే అభిప్రాయం వ్యావహారిక భాషావాదంగా బలపడింది.
కానీ మాట్లాడే భాషలోని యాస, వెటకారం, ఎత్తిపొడుపు, పుల్లవిరుపు రాతలో పట్టుకోవడం కష్టం.

ఉదా:

  • “మా బాగా చెప్పావే” → ఇందులో వెటకారం ఉందా? లేదా?
  • “ఆహా అట్టాగా! నాకు తెలీదులే” → ఇందులో పుల్లవిరుపు ఉందా?

యాస (ఏస) – గుంటూరు ప్రత్యేకత

ఏ మాండలికానికైనా తనదైన పదజాలంతో పాటు పలుకు తీరు వేరుగా ఉంటుంది. అదే యాస (ఏస).

గుంటూరు మాండలికానికి పైకి విడిగా వినపడే యాస తక్కువ.
అందుకే జాషువ:

“ఏస కొంచెము లేని హృదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు”
అని గుంటూరు సీమని మెచ్చుకున్నారు. “వీర భాషాభిరామ” అన్నారు.


“శానా బాగుంటది” – పదజాలం

సాధారణ పదాలు

శానా, మల్లె, బొవు, కుశాల, ఉచ్చిలి, ఆమైన, మయాన, దబ్బున, దానికల్లె, ఓ పాలి, పెడద్రం, కాత్తెలెక్క

క్రియారూపాలు

బాగుంటది, వచ్చిద్ది, ఇప్పిచ్చు, తీసకపో, లెగిశాడు, పెట్టమాకు, కొనబాకు, కొట్టవాకు, అడగ్గాకు

వికృత రూపాలు

శాపలు, గేనం, గెప్తి, కూకో, కట్టం, ఇట్టం, నట్టం

నిందార్థక వాక్యాలు (ప్రయోగాలు)

“దీని మొదులార!”, “నీ పుటమార!”, “ఆడి జిమ్మదియ్య!”, “తిత్తిదీస్తా”, “తల్లి ముండమొయ్య!”, “తస్సదియ్య!”

ధ్వన్యనుకరణ శబ్దాలు

లటిక్కిన, గబిక్కిన, దభీల్న, సెరసెరా, క్లె! క్లె!, వార్నీ!


ఉచ్చారణ ధోరణి: ఒత్తులు, మహాప్రాణాలు

జనసామాన్య భాషణలో మహాప్రాణాక్షరాలు పలకవు. ఒత్తులు ఎగిరిపోతాయి.
పలుకు సౌమ్యంగా, మృదువుగా వినపడుతుంది.

ఉదా:

  • “దనం ఎంత గనంగా వున్నా గునం ముక్కెం”
  • “నీల్లల్లో శాప తలుక్కుమంది”
  • “సాల్లే సంబడం, సూశావ్‌గా, సల్లగా, సెట్టుగ్గాదు, నీకే సెప్పేది”

మాటల మధ్య అక్షరాలు మాయమయ్యే ఉదా:


“వ్‌ఁ” ప్రయోగం: మేవ్‌ఁ వచ్చావ్‌ఁ

శిష్టేతరుల భాషలో ఉత్తమ పురుష ప్రత్యయం ‘ను’ లోపిస్తుంది:

  • బెజవాడెల్లా(ను), ఇప్పుడే వచ్చా(ను), నీ కోసం గొలుసు కొన్నా(ను)

నిశ్చయార్థక క్రియల్లో చివర :

  • కొట్టాల, చెయ్యాల, తినాల

వ్యతిరేక క్రియల్లో తుది అక్షరం లోపిస్తుంది:

  • ఇంకా నూర్పిళ్లు కాలా, అన్నం దినలా, ఊరికి పోలా

పదాంత ము → ం → వ్‌ఁ:

  • “మేవ్‌ఁ (మేం) వొచ్చావ్‌ఁ (వచ్చాం)”

సంధి/లోపం: తలాకిలి, పుచ్చొంకాయలు

రెండు మాటలు కలిసే చోట రెండో మాట మొదట్లో వకారం లోపిస్తుంది; కొన్ని చోట్ల ‘ఓ’ ఆదేశమవుతుంది.

ఉదా:

  • తలాకిలి (తల + వాకిలి)
  • సందేలప్పుడు కూతురొచ్చింది పిల్లోళ్లతో
  • పుచ్చొంకాయలు

అక్షర ప్రయోగాల గమ్మత్తు

‘గ జ డ ద బ’లు బహుళంగా వాడటం కనిపిస్తుంది.

ఉదా:

  • “అమాస రేపు గద్దనంగా వొచ్చాడు”
  • “ఎట్ట జావాలంట నీతో? తిత్తి దీస్తా”

అనుబంధ ప్రత్యయాలు & వర్ణ సమీకరణం

ఉదా:

  • “నాలుగు దన్నే తలికి పందల్లె గీపెట్టాడు”
  • “ఈ వారం గడిసినాక నీ కాడ కొత్తా”

వర్ణ సమీకరణం (సామీప్యం వల్ల ధ్వని మారడం):

  • “అద్దరేత్రి దాక యాడ పెత్తనాల కెల్లా?”
  • వడ్డ (వడ్ల) గింజలో బియ్యం గింజ
  • “సెనక్కాయలు సెరుగ్గడ మల్లే తియ్యగా వుంటయ్యా యేంది?”

వర్ణ వ్యత్యయం (అక్షరాలు తారుమారు):

  • “కాలికి రాయి తలిగింది”
  • “పలక పలిగింది”

“రాటం రాటం”: పునరుక్తి క్రియారూపాలు

‘తక్షణం’ అర్థంలో క్రియారూపాలు పునరుక్తి చెందుతాయి:


భూతకాలంలో లింగ ప్రత్యయం మార్పు

భూతకాల ప్రస్తావనలో కొన్ని సందర్భాల్లో పుంలింగ ప్రత్యయానికి బదులు స్త్రీలింగ ప్రత్యయాన్ని వాడటం కనిపిస్తుంది.

ఉదా:

  • “ఎవురవపడ్డా నవ్వుతా పలకరిచ్చేది. యివరాలన్నీ అడిగేది”

ఎన్ని మాటలో: ఆణిముత్యాల్లాంటి పదాలు

మొత్త- మూల, అప్పెసం- అనుక్షణం, ఇలంబ్రం- విశాలం, కట్టుమట్టు- పశువులను కట్టేసే స్థలం,
గరువు- ఇసుకనేల/ఎర్రనేల, చిప్పరలు- వర్షాల తర్వాత కనిపించే గడ్డిమొలిచిన భాగాలు,
గనికె- చిన్న గడ్డపలుగు, గమిడి/గవిడి- ఊరు చివర/సరిహద్దు, చంగనాలు- పరుగులు,
దారకం- ఆధారం, ఏగిలి- పొలంలో ఓ పంటవేసి ఇంకో పంట కోసం వదిలిన భాగం…


రచనల్లో గుంటూరు భాష

చలం, కొడవటిగంటి వంటి రచయితలు స్థానికభాషని పెద్దగా పట్టించుకోలేదని భావన ఉంది.
అయితే మాధవపెద్ది గోఖలే (సన్న జీవాలు, బల్లకట్టు పాపయ్య) గుంటూరు జీవద్భాషకి అద్భుత కథారూపమిచ్చారు.
ఆ తర్వాత అందే నారాయణస్వామి. అదే ఒరవడిలో కొలకలూరి ఇనాక్, పాపినేని, వల్లూరు శివప్రసాద్, విజయరామరాజు,
ఎంవీ రామిరెడ్డి, బండ్ల మాధవరావు వంటి రచయితలు ఈ మాండలికాన్ని తమ రచనల్లో పదిలపరుస్తున్నారు.


ముగింపు: భాష ఎప్పుడూ మారుతూనే ఉంటుంది

ఏ సంస్కృతి అయినా స్థిరంగా ఉండదు. ఎల్లప్పుడూ మారుతుంటుంది.
అందులో భాగమైన భాష కూడా ఎల్లకాలం కుదురుగా ఉండదు.

ఆదాన-ప్రదానాల వల్ల కొత్త మాటలు చేరతాయి. జన జీవనం విస్తరించేకొద్దీ, ఇతర ప్రాంతాలతో సంబంధాలు పెరిగేకొద్దీ
ప్రాంతీయ ప్రత్యేక పదజాలం వెనకాడి, సామాన్య పదజాలం పెరుగుతుంది.

కాబట్టి భిన్న మాండలికాల మధ్య ఖచ్చితమైన విడిగీత గీయలేం.
గుంటూరు మాండలికానికి కృష్ణ, ప్రకాశం జిల్లాల మాండలికాలకి చాల పోలికలుంటాయి.
ఓ మాండలికాన్ని పరిశీలించేటప్పుడు ఈ అతివ్యాప్తి (ఒక పరిధి దాటి మరొక దానికి కూడా అన్వయించటం)ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.