ఇక్కడ ఇనుము కూడా మెత్తగా ఉంటుంది అంటాడో కవి మిత్రుడు.
తీర ప్రాంతం కదా — తడి ఎక్కువ… మడి కూడా ఎక్కువ.
కానీ ఆతిథ్యానికి అప్పు చేసైనా లోటు రానీరు.
ఇంటికి వచ్చిన అతిథినే కాదు, చిరునామా అడిగిన వారిని సైతం
“రండి… అయ్యా… అమ్మా… తమరు… మీరు” అంటూ గౌరవంగా పలకరిస్తారు.
అందులో అప్యాయతనూ మేళవిస్తారు.
చిత్రమేమిటంటే —
దెబ్బలాడుకునేటప్పుడు కూడా “తమరు, మీరు, అండి” అని సంభోదించుకుంటారు ఇక్కడ.
పుస్తెల తాడు అమ్మి అయినా పులసలు తినాలి…
అప్పు దొరికితే పప్పుతో పాటు ఉప్పు చేప కూడా…
కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు…
చేతిలోది లేత, చేలోది ముదర…
బంగారముంటే సింగారానికేమి కొదువ…
ఇలాంటి సామెతలెన్నో ఇక్కడి ప్రజల నాలుకలపై తరచూ నాట్యం చేస్తాయి.
ఇక పశ్చిమాన పరిఢవిల్లే పలుకుబడులైతే ఎన్నో… ఎన్నెన్నో!
వాటిలో ముఖ్యమైనవి ఇవీ —
అఘోర శబ్దం సంస్కృతం.
శివుడి అయిదో ముఖం. దక్షిణ దిశలో శ్మశానం వైపు ఉండేది.
అతిభయంకరంగా ఉంటుందని అర్థం.
ఈ పదాన్ని ఇక్కడ రెండు రకాలుగా ప్రయోగిస్తారు.
ఒకటి —
ఎలాగో ఒకలాగ చెయ్యమనో, చెప్పమనో, వినమనో, కనమనో, బాధపడమనో అన్న భావంలో.
రెండోది — ఆక్షేపణ.
నిరసన, నిర్లక్ష్యం, విచారం, వేళాకోళంగా
అఘోరించావులే అని అంటారు.
ఊదరపెట్టు
నసపెట్టు, పొగపెట్టు అనే రెండు విధాలుగా వాడుకలో ఉంది.
పొగచుట్టల్ని ఒకదానికొకటి ఆనించి నిప్పు అంటించుకోవడాన్ని
ఊదర అంటారు.
సణుగుడుగా బాధించడాన్ని కూడా ఇదే పదంతో వ్యవహరిస్తారు.
దేవిరించు
దేవిరింపు, దేవిరింత, దేబెరింత, దేవురుగొట్టు వంటి అర్థాలున్నాయి.
దేబె అనే నామపదానికి
కక్కుర్తి మనిషి, అప్రయోజకుడు, మూర్ఖుడు, అథముడు అనే అర్థాలున్నాయి.
ఇక్కడ ప్రఖ్యాతమైన సామెత:
ఛప్పన్నారు
పూర్వం అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ మొదలైన
56 ప్రత్యేక రాజ్యాలుండేవి.
వీటిని హిందీలో “ఛప్పన్న దేశ” అంటారు.
ఛప్పన్ అంటే యాభై ఆరు.
దానికి చివర తెలుగు సంఖ్యాపదం ఆరును చేర్చి
అర్థభేదం లేకుండా ప్రయోగించడం
ఈ జిల్లా వాసుల ప్రత్యేకత.
విడివిడిగా వినూత్నంగా బతికే వారిని
ఈ మాటతో పిలుస్తుంటారు.
ఇందులో కొంత వ్యంగ్య వైభవం కూడా ఉంటుంది.
పశ్చిమగోదావరి పదప్రయోగాలు
పశ్చిమగోదావరి జిల్లాకు తనదైన పదసంపద ఉంది.
తినడానికి, చూడటానికి వంటి పదాలు ఇక్కడ
తిన్నాకి, చూన్నాకిగా మారతాయి.
ఇతర సాధారణ మార్పులు:
కాలసూచికలలో కూడా పశ్చిమం ప్రత్యేకమే:
- చీకట్నే
- తెల్లార గట్ట (తెల్లవారుజామున)
- బారెడు పొద్దు (ఉదయం)
- మజ్జానాలు (మధ్యాహ్నం)
- సందాల (సాయంత్రం)
- మాపున / మాపటికి / మాపటేల / మాపులకి (రాత్రి)
కట్టపడితేనే ఒత్తాయండీ అంటూ
చేలల్లో రెక్కలు ముక్కలు చేసుకునే పశ్చిమగోదావరి ప్రజ,
ఆధునిక కాలంలోనూ నాటి తెలుగు సంస్కృతిని
జారత్తగ కాపాడుకుంటోంది.
తనదైన యాసను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇంతేనండీ మరి!
