warangallu

ఓరుగల్లు (వరంగల్లు): కాకతీయుల తోరణమంత తెలుగు వైభవం

తెలుగునేలను ఏకం చేసి వైభవంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యానికి కేంద్ర బిందువు
తిక్కన, పాల్కురికి సోమన, శివదేవయ్య, పోతన లాంటి కవి పండితులు నడిచిన నేల… ఓరుగల్లు.
కుతుబ్‌షాహీలు, నిజాంల పాలనలో మహమ్మదీయ ప్రాబల్యానికీ లోనైన ప్రాంతమిది.
అలంటి వరంగల్లు తెలుగు వైభవం కాకతీయుల తోరణమంత!


సాహితీ చైతన్యం

పోతన భాగవతం భక్తి పారవశ్యత, పక్కనే పాల్కురికి సోమనాథుడు అందించిన జానుతెనుగు కవిత్వం…
ద్విపదలు, అష్టకాలు, రగడలు, సీసాలు… ఇవన్నీ ఓరుగల్లు గడ్డ మీద సాహితీ చైతన్యాన్ని రగిల్చాయి.

మనుమసిద్ధి రాయబారిగా తిక్కన గణపతి దేవుని ఆస్థానాన్ని సందర్శించి,
ఆయన ఆస్థానంలోనే భారతాన్ని వినిపించాడట!


కాలమార్పులతో కలిసి జనభాష పరిణామం

కాలక్రమేణా వస్తున్న మార్పులను అనుసరించి ఇక్కడి జన భాష కూడా పరిణామం చెందుతూనే ఉంది.

నిజాం పాలనలో అధికార భాష ఉర్దూ. పైగా వరంగల్లు ప్రత్యేక సుబాగా (ఇప్పటి రాష్ట్రం) ఉండింది.
అందువల్ల ఇక్కడి పలుకులు ఉర్దూ మిశ్రమంగా సాగుతాయి.


ఉర్దూ ప్రభావం

జనగామ, వరంగల్లు, మహబూబాబాదు, నర్సంపేట, ములుగు, పరకాలలు పురాతన తాలూకాలు.
ములుగు, పరకాల, నర్సంపేటల్లో అటవీ ప్రాంతం గిరిజన సంస్కృతికి ఆటపట్టు.

హైదరాబాదు నుంచి దిల్లీ, విజయవాడలకు వెళ్లే రైలుమార్గాలు ఈ జిల్లా గుండా వెళ్లడం వల్ల నాగరికత ఎన్నో మార్పులకు లోనైంది.

ఉర్దూ మిశ్రమ పదాలు (ఉదాహరణలు)

పట్టణ ప్రాంతాల్లో ఆధునిక ప్రామాణిక భాష ఎక్కువ.
గ్రామీణుల నాలుకల మీద మాత్రం జిల్లా మాండలిక సొగసులు తాండవమాడతాయి.


గ్రామీణ సంభాషణ మచ్చుకు

“ఏంది బిడ్డా నాయిన పరేషాన్‌ జేసిండంట. దవాఖానకు తీసుకుపోయిండ్రా!”
“ఏం లేదన్నా! ఏందో గుబులు పెట్టుకున్నడు, చెప్పడు.
గా డాక్టరేమో ఫర్వాలేదు, సోంచాయించొద్దని చెప్పిండు. దిగులు పడొద్దన్నడు”

తెలుగు–ఉర్దూల జమిలిగా కనిపిస్తుంది వరంగల్లు గ్రామీణుల సంభాషణ.


వరంగల్లు మాండలిక పదసంపద


వ్యవసాయం చేసేవాళ్లు ఆరుగాలం కష్టపడాలి. నిత్యం పొలం చూసుకోవాలి. లేకపోతే పంట సరిగా చేతికి అందదు. దీనిని సూచించేదే పొలంకాడికి పోనోని ఎవుసం- పొయిల వెట్టినట్టే ఉంటదట అనే సామెత. ఒక పనిచేస్తూ మధ్యలో మరో పనిలో తలదూర్చే వాళ్లను ఉద్దేశించి కోడెగిత్తలతో ఎవుసం జేత్తే ఆవులు గనవడంగనే అవుతలపడ్డయట అనే సామెత ఉపయోగిస్తారు. మామూలు పనే చేయలేని వ్యక్తి పెద్దపెద్ద పనులు చేస్తానని డంబాలు పలికితే వాడే సామెత ఖుష్కిల దున్ననోడు తరిలనైతే తప్పక దున్నతనన్నడట. పెద్దగా కష్టపడకుండా ఎక్కువ సంపాదించుకుంటే కూలికి పోయినమ్మకంటే పరిగెకు పోయినమ్మకే లాభమట లాంటి సామెతలు ఇక్కడి గ్రామీణుల్లో ప్రత్యేకం. వీటికి తోడుగా కడ్పులున్న సుఖం కాశికి పోయినా దక్కదట, ఇంటింటికి మంటిపొయ్యి, ఆశకు ఊశిగాడు సచ్చిండంట, ఉట్టికి గాకుండ, సొర్గానికి గాకుండ అయితది, చెప్పుకుంటె సిగ్గువాయె, చెప్పకుంటె మానం బాయె, పని పాతరబెట్టి, ఊరు జాతర బోయినట్టు, ఇచ్చుకున్నోడు ఈగ, పుచ్చుకున్నోడు పులి, అచ్చికాలు బుచ్చికాలు ఆర్నెల్లు... ఇచ్చుక దంతం మూణ్నెల్లు, అయినోడు అయిదం చెట్టు- కానోడు కానుగచెట్టు, బొక్క తినంగ భోగం... లెక్క చెప్పంగ దుఃఖం, సోకులు సోలెడు... మాటలు మానెడు లాంటి సాధారణ సామెతలు కూడా ఇక్కడి ప్రజల నోళ్లలో నానుతుంటాయి.